- ఉత్తర్వుల కాపీని సీఎం రేవంత్ రెడ్డికి అందజేసిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
- ఒక్కో ఇంటికి రూ.72 వేలు ఇవ్వనున్న కేంద్రం
- రాష్ట్రానికి త్వరలోనే రూ.1,152 కోట్ల నిధులు
హైదరాబాద్, వెలుగు: పీఎం ఆవాస్ యోజన (గ్రామీణ్) కింద తెలంగాణకు కేంద్రం మంజూరు చేసిన 2 లక్షల ఇండ్లకు సంబంధించిన ఉత్తర్వుల పత్రాన్ని (మంజూరు లేఖను) కేంద్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎస్ సంజయ్ జాజు, హౌసింగ్ సెక్రటరీ గౌతమ్ పాల్గొన్నారు. పీఎంఏవై గ్రామీణ్ కింద కేంద్రం ఒక్కో ఇంటికి రూ. 72 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనుంది.
9 ఏండ్ల తర్వాత రూరల్ కోటా
రాష్ట్రానికి 2017 తర్వాత మళ్లీ ఇప్పుడు అంటే తొమ్మిదేండ్ల తర్వాతే రూరల్ కోటా కింద ఇండ్లు మంజూరయ్యాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించకపోవడంతో నిలిచిపోయిన ఈ ఇండ్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరంతరం కేంద్రంతో సంప్రదింపులు జరిపింది. ఫలితంగా కేంద్రం ఈ 2 లక్షల ఇండ్ల లేఖను విడుదల చేసింది. రాష్ట్రంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్‌లో మొదటి విడతలో దాదాపు లక్షా 60 వేల ఇండ్లు పూర్తయ్యాయి. కేంద్రం నుంచి లేఖ అందడంతో వీటి కోసం మొదటి విడతగా సుమారు రూ. 1,152 కోట్ల నిధులు రాష్ట్రానికి రానున్నాయి. కేంద్రం నుంచి క్లియరెన్స్ రావడంతో ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి నిలిపివేసిన ఇందిరమ్మ ఇండ్ల చివరి విడత బిల్లుల (రూ.1.11 లక్షలు) చెల్లింపులను వేగవంతం చేయనుంది.
కేసీఆర్ సర్కార్ ఇండ్లు తీసుకోలేదు: చౌహాన్
నాడు కేసీఆర్ ప్రభుత్వం పీఎం ఆవాస్ యోజన ఇండ్లను తీసుకోలేదని, ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందడుగు వేయడంతో 2 లక్షల ఇండ్లను మంజూరు చేశామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన కచ్చా ఇండ్ల సర్వే ఆధారంగా తదుపరి విడతల్లో మరిన్ని ఇండ్లు ఇస్తామని, తెలంగాణ అభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు.
